ఎండమావుల నడుమ పూదోట

శనివారం సాయంత్రం..
బార్ లో జనం కొంచెం ఎక్కువగానే ఉన్నారు.
ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒంటరిగా, మౌనంగా కుర్చుని ఉన్నాడు రఘు. ఎదురుగా ఉన్నా విస్కీ పోసిన గ్లాసు వంక తదేకంగా చూస్తున్నాడు. గ్లాసులో ఉన్నా ఐస్ క్యూబ్ గిర గిరా తిరుగుతుంది, సరిగ్గా తన మనసులో ఆలోచనల సునామి లాగా.
చుట్టూ పక్కల జరుగుతున్నవి ఏవీ తనకి సంబంధం లేనట్టు, ఈ ప్రపంచంలో తను ఒక్కడే మిగిలిపోయినట్టు, జీవితం ఇక్కడే ఆగిపోయినట్టు.. నిస్తేజంగా ఉన్నాయి అతని కళ్ళు.

"హాయ్ రా" ఎవరో పిలిచినట్టు ఉంటే తలపైకెత్తి చూసాడు రఘు.
'ప్రశాంత్' , తన చిన్న నాటి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ప్రతి సంతోషం లోను ప్రతి బాధలోనూ పాలు పంచుకున్న వ్యక్తి.
"ఏంట్రా... ఉన్నట్టుండి రామ్మన్నావ్?" రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ప్రశాంత్.
రఘు మౌనంగానే ఉన్నాడు. ఇంతలో బేరర్ వచ్చి ప్రశాంత్ కి కూడా ఒక విస్కీ గ్లాసు పెట్టి వెళ్ళాడు.
అయిదు నిమిషాలు మౌనంగానే గడిచిపోయాయి.. ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది. రఘు జీవితంలో ఏదో ఊహించనిదే జరిగింది.

మళ్ళి కదిలించడానికి ప్రయత్నించాడు ప్రశాంత్..
"ఏమయింది రా? ఏదయినా సమస్యా?"
తల పైకేతి ప్రశాంత్ వైపు చూసాడు రఘు..
రఘు కళ్ళలో పలచటి కన్నీటి తెర. గద్గద స్వరంతో ఒక్కో మాట కూడబలుక్కుంటూ అన్నాడు.."అంతా అయిపోయిందిరా, ఇంకేం మిగల్లేదు నా జీవితానికి"

రఘుని అలా చూడగానే కలవార పడిపోయాడు ప్రశాంత్. వెంటనే లేచి రఘు పక్కగా వచ్చి కూర్చుని, అతని బుజం మీద చేయి వేసి
"ఏమయింది రా? నాతో చెప్పరా.." బుజ్జగిస్తూ అడిగాడు ప్రశాంత్.
"వచ్చే నెల తన పెళ్లి" తల వంచుకుని చెప్పాడు రఘు.
"అదేంట్రా తను ఇంట్లో చెప్తానంది గా?" విస్మయంగా అడిగాడు ప్రశాంత్.
"చెప్పింది. వోప్పుకోలేదురా వాళ్ళు. కులం పట్టింపు ఎక్కువారా వాళ్ళ నాన్నకి. ససేమీరా అన్నారు."
"మరి తనేమంది?"
"తనేం చేయలేదురా.. వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా తను ఏమి చేయలేదు. ఒక వేళ ఏమయినా చేసినా.. తరవాత వాళ్ళ నాన్నని ఊర్లో అందరు చులకనగా చూస్తూ, అవహేలనగా మాట్లాడితే తను బరించలేను అంటుంది. తనను ఎంతో ప్రేమగా చూసే తండ్రి, తన వలన అందరి చేత మాట పడటం తను బరించలేను అంటుంది. కాని తను కూడా చాల ఏడుస్తుంది రా.."

"అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయిందన్నమాట"

"అవును, ఇంక చేసేది ఏమీ లేదు. కాని తను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా రా.. ఏ పని చేస్తున్న తనే గుర్తొస్తుంది, గుండెలు పిండేసినట్టు ఉంటుందిరా. ఈ భాద బరించేకంటే చావడం మేలనిపిస్తుంది. అసలు తనని ఇంకో వ్యక్తీతో ఊహించుకోలేకపోతున్న రా" పూర్తిగా కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రఘు.

ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది.

"రఘు నీ పరిస్తితి అర్ధం చేసుకోగలను.. బాధపడకు. కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయి. కొంచెం నిబాయించుకో.."
"నా వల్ల కావడంలేదురా... నాకు ఇంకేమి జీవితం కనపడటం లేదు"
"అందుకని ఇలా రోజు తాగి, ఏడుస్తూ తాగుబోతులా తయారవుతావా..?"
"నీకేం తెలుస్తుందిరా.. నా బాధ.. అనుభవిస్తే తెలుస్తుంది.." ఉక్రోషంగా అన్నాడు రఘు.
"అరేయ్.. ఒక్క మాట అడుగుతాను చెప్పు.. తన పరిస్థితి ఏంటో ఆలోచించావా?"

ప్రస్నార్దాకంగా చూసాడు రఘు.
"నీకు బాధగా ఉంటే.. స్నేహితులందరికీ చెప్పుకుంటావు. ఇలా బార్ కి వచ్చి తాగుతావు. ఆ తరవాత మత్తులో ఒళ్ళు మీద తెలియకుండా పోడుకుంటావు. మరి తనేం చేస్తుందిరా? తనకి కూడా బాద ఉంటుంది గా?"
రఘు ప్రశాంత్ వంక భావరహితంగా చూసాడు..

"అవును రా.. తను నీకు లాగా అందరికి చెప్పుకోగాలాదా? నీకు లాగా తాగి పడిపోగాలదా? తనలో తానూ కుమిలిపోవల్సిందేగా..
పైగా ఇలా తాగి జీవితాన్ని పాడు చేసుకుంటున్న నిన్ను చూసి.. తను ఇంకా నరకం అనుబవించాలిగా.. ఇది ఎప్పుడయినా ఆలోచించావా నువ్వు?"
నిజమే.. ప్రశాంత్ చెప్తున్న కోణంలో తను ఎప్పుడు ఆలోచించనేలేదు..
రఘు నిశ్సబ్దంగా ప్రశాంత్ మాటలు వింటూ ఉండిపోయాడు.

"రఘు, చేతిలో చేయడానికి ఏమి లేనప్పుడు. నువ్వు బాదపడుతూ.. తనని కూడా ఎందుకు క్షోభకు గురిచేయాలి?"
ప్రశాంత్, రఘు బుజం మీద చేయివేసి చెప్తూ ఉన్నాడు..

"ప్రేమ ఎప్పుడు ఎదుటి వారి సంతోషాన్ని మాత్రమె కోరుకుంటుంది.. అలా కోరుకోవాలి అదే నిజామయిన ప్రేమ. అన్ని అనుకూలించినప్పుడు ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన సంతోషాన్ని నువ్వు కాంక్షించాలి. చెప్పడం తేలికే.. కాని ప్రయత్నించు. తనకి సంతోషంగా కనపడు. నువ్వు నార్మల్ అవ్వగలవని తనకి అనిపించేటట్టు చెయ్యి. పనిలో ఏకాగ్రత పెట్టు. కొంత కాలం ఆగి చూడు. అన్ని సర్దుకుంటాయి. తన జీవితం బాగుండాలి అని కోరుకో."
ప్రశాంత్ మాటలు వింటున్న రఘు ప్రశాంత్ మీద వాలి పోయి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.

"ఒకటి గుర్తు పెట్టుకోరా రఘు, గుండెలు పిండే బాద ఉన్నా.. ప్రేమించిన వారి కళ్ళలో సంతోషాన్ని చూడలనుకోడమే.. ప్రేమ"

ఆకరి బొట్టు వరకు ఏడ్చాడు రఘు. కాని ప్రశాంత్ మాటలు అతన్ని ఆలోచింపచేసాయి. మనసులోనే అనుకున్నాడు..

"ఎండమావుల నడుమ పూదోట పూయిస్తాను... నీ అందమయిన జీవితానికి కానుకగా"

3 comments:

  1. యెప్పటిలాగానే ఒక మంచి సందేశాన్ని హ్రుదయవిదారకమైన కధనంతో చెప్పారు.
    Very well done.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

మరి మీరేమంటారు?